19/09/2020
జర్మన్ షెఫర్డ్ (German Shepherd)
వీటినే ఆల్సేషన్ కుక్కలు అని కూడా అంటుంటారు. పోలీసు జాగిలం. చాలా దేశాల్లో వంద సంవత్సరాలకు పైగా పోలీసులకు, సైనికులకు ఇది సేవలు అందిస్తోంది. ఇంటికి రక్షణనివ్వడంలో సాటిలేనిది. 25 అంగుళాల ఎత్తు, బరువు 34 నుంచి 43 కిలోల మధ్య ఉంటుంది. చాలా బలంగా, చురుగ్గా ఉండే ఇవి ఇంట్లోకి ఆగంతకులు, కొత్త వారు వస్తే జడుసుకునేలా చేస్తాయి. కట్టేసి ఉండకపోతే కొత్త వ్యక్తులు గేటు దాటితే వారి పని అయిపోయినట్టే. బలంగా ఉండే వీటిని దారికి తేవాలంటే తగినంత బలం ఉండాలి. వీటి జీవిత కాలం 12 ఏళ్లు. కొన్ని స్నేహంగా ఉంటే, కొన్ని చాలా విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తాయి. శిక్షణ ఇస్తే ఈజీగా నేర్చుకుంటాయి. ఎప్పటికప్పుడు జుట్టు కత్తిరిస్తూ వుండాలి.
జర్మన్ షెప్పర్డ్ కుక్క జర్మనీ దేశానికి చెందింది. ఈ జాతి కుక్కలకు గల బలం, తెలివితేటలు, శిక్షణ పొందటంలో గల నేర్పరి తనం మొదలైనవన్ని వీటిని పోలీస్, మిలిటరీ శాఖలలో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. జర్మన్ షెప్పర్డ్ వివిధ రంగులలో వుంటుంది. సాధారణంగా ఎరుపు, ట్యాన్, బ్రౌన్, బ్లాక్, టాన్-బ్లాక్, రెడ్-బ్లాక్ రంగుల్లో వుంటాయి. దీనినే అల్సేషియన్ అని కూడా పిలుస్తారు. అమెరికాలో ఉన్నతంగా చెప్పబడే 5 రకాలలో జర్మన్ షెప్పర్డ్ ఒకటి. వీటి సంరక్షణకు దిగువ విధానాలు పాటించండి.
వీటి బొచ్చు అధికంగా ఊడకుండా ప్రతిరోజు బ్రష్ చేయండి. సంవత్సరంలోని అన్ని కాలాలలోను, రెండు సార్లు అత్యధికంగాను బొచ్చు ఊడి మరల వచ్చేస్తూంటుంది. మీ కుక్క వెయిట్ ఎప్పటికపుడు గమనిస్తూండండి. వీటికి గుండె సంబంధిత లేదా కీళ్ళ నొప్పులు వంటివి సాధారణంగా వస్తాయి. ఈ జాతి కుక్కలకు కాటారాక్టులు, కాల్షియం సంబంధిత, క్రానిక్ పానిక్రియాటిక్, హిప్, ఎల్ బో డిస్ ప్లేసియా, ఎపిలెప్సీ, హోఫిలియా, డిస్క్ స్లిప్, రెటీనల్ మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. అల్సేషియన్ కుక్కలు ఆరోగ్యంగా వుండాలంటే వాటికి మంచి వ్యాయామం కావాలి. వీలైనన్ని సార్లు బయటకు తీసుకు వెళ్ళడం ఆడటం చేస్తే అవి శక్తివంతంగా వుంటాయి.
ఈ కుక్కలకు ప్రతిరోజూ స్నానం అవసరం లేదు. వారానికి మూడు సార్లు స్నానం చేయించండి. బొచ్చు ఊడకుండా ప్రతి రోజూ బ్రష్ చేయండి. కాలిగోళ్ళను రెండు వారాలకొకసారి కత్తిరించండి. లేదంటే స్కిన్ ఎలర్జీలు వస్తాయి. వీటికి నేలను తవ్వే అలవాటు వుంటుంది. కనుక బయటనుండి రాగానే పాదాలు శుభ్ర పరుస్తే ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుంది. జర్మన్ షెప్పర్డ్ తెలివితేటలకు పెట్టింది పేరు. చక్కగా శిక్షణ ఇవ్వండి. దాని కోపాన్ని కూడా అది అరికట్టుకుంటుంది.
ఆట వస్తువులు వాటికి చాలా ఇష్టం. కనుక వాటి కొరకై కొన్ని ఏర్పరచండి. వాటిని క్రమశిక్షణలో వుంచాలంటే నడకలో, ఆహారంలో మొదలైన వాటిలో శిక్షణ నివ్వండి. వాటి చెవులను వారానికొకసారి శుభ్రపరచండి. పండ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. ఇవి కుటుంబంలో ఒక సభ్యులుగా వుండాలని ప్రయత్నిస్తాయి. కనుక కుటుంబంలోని ఇతర సభ్యులతో కూడా స్నేహపూరితంగా వుండేలా శిక్షణ నివ్వండి. ఎక్కువ ముద్దు చేయవద్దు. ఎక్కువ ముద్దు చేస్తే దానికి మరింత గర్వం కలుగుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే, మంచి పోషకాహార విలువలు కల మాంసం, కేరట్, మొదలైనవి పెట్టి ఆరోగ్యంగా వుంచండి.
జర్మన్ షెప్పర్డ్ కుక్కలను పెంచే వారికి దానికవసరమైన ఆహారం ఏర్పాటుకు కొన్నిఐడియాలిస్తున్నాం. పరిశీలించండి. ఈ కుక్కకు మంచి పోషకాహార విలువలు కల ఆహారం కావాలి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్, ఫ్యాటు యాసిడ్స్ కావాలి. డాక్టరు ఫీజు మిగిల్చుకోవాలంటే ఈ కుక్కల యజమానులు వీటికి మంచి ఆహారం ఇవ్వాల్సిందే.
1. జర్మన్ షెప్పర్డ్ కుక్కలు అతి త్వరగా షుగర్ వ్యాధికి లోనయ్యే ప్రమాదం వుంది కనుక వీటి ఆహారంలో 8 శాతం కొవ్వు, 50 శాతం కార్బోహైడ్రట్లు పీచు పదార్ధాలు ప్రతి దినం దాని ఆహారంలో వుండేలా చూడాలి.
2. మాంసం, ఉడకించిన బంగాళ దుంపలు ఇతర కూరలు తింటాయి. మాంసంతో వివిధ రకాల కూరలు కలిపి పెడితే బాగా తింటాయి.
3. వీటికి గోధుమ పిండితో తయారు చేసిన ఆహార పదార్ధాలు బాగా సరిపడుతాయి. వీటిని స్నాక్స్ గా ఇవ్వవచ్చు.
4. జర్మన్ షెప్పర్డ్ ఆహారంలో పాల ఉత్పత్తులైన పాలు, జున్ను మొదలైనవి కూడా చేర్చవచ్చు. ఇంతేకాక, వీటిలో దానికిష్టమైనవి చేర్చి అయిష్టమైనవి తీసేయండి.
5. బయట వాతావరణం చల్లగా వుంటే, ఈ కుక్కలు వేడిగా పాలు లేదా ఇతర కేకులవంటివి తినటానికి ఇష్టపడతాయి. చేపలు, కోడి గుడ్లు మొదలైనవి కూడా పెట్టవచ్చు.
6. కేరట్లు, టొమాటోలు, విటమిన్- ఇ కల నూనెలు కూడా వీటి ఆహారంలో చేర్చవచ్చు.
7. ఆహారమే కాక వీటికి రెగ్యులర్ వ్యాయామం ఇతర ఆటలు కూడా చేయిస్తే చురుకుగా వుంటూ ఆరోగ్యంగా వుంటాయి.